telangana
టీ.జీ.పీ.ఎస్.సీ పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి :తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 26వ తేదీలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీ.బీ.టీ) విధానంలో పరీక్షలు జరుగనున్న నేపధ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సాయంత్రం పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్టు (అనలిస్ట్), అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ ద్వారా ఈ నెల 24, 26 తేదీలలో జిల్లాలోని అర్సపల్లిలో గల ఏ.వీ ఎంటర్ ప్రైజెస్ సెంటర్ లో పరీక్షలు నిర్వహించనుండగా, పరీక్షా కేంద్రంలో సరిపడా కంపూటర్లు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ పరికరాలు, ఇంటర్నెట్ కనెక్షన్ ఇత్యాది సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేవా అని కలెక్టర్ గమనించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూడాలని, పరీక్షా కేంద్రంలో తాగునీరు, వైద్య సదుపాయాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అభ్యర్థులను లోనికి పంపాలని, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అనుమతించకూడదని సూచించారు. కాగా, నిర్ణీత సమయానికి ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. అభ్యర్థులకు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాన్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని అన్నారు. మొదటి సెషన్ పరీక్షకు సంబంధించి ఉదయం 8.00 గంటల నుండే పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని, 9.30 గంటలకు గేట్లు మూసివేస్తారని, నిమిషం ఆలస్యం అయినా అనుమతించబడరని తెలిపారు. సెకండ్ సెషన్ పరీక్షకు సంబంధించి మధ్యాహ్నం 12.30 గంటల నుండి లోనికి అనుమతించడం జరుగుతుందని, 2.00 గంటలకు గేట్లు మూసివేస్తారని కలెక్టర్ వెల్లడించారు. నిర్ణీత సమయం దాటిన మీదట ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి పంపడం జరుగదని అన్నారు. పరీక్షా సమయం ప్రారంభం అయిన మీదట ముగిసేంత వరకు పరీక్ష కేంద్రం నుండి ఎవరూ బయటకు వెళ్లకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రంలో ఎగ్జామినేషన్ డ్యూటీలో పాల్గొంటున్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన బంధువులు ఎవరూ పరీక్ష రాయడం లేదని వారి నుండి ధృవీకరణ పత్రం తీసుకోవాలని కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ట్రైనీ సబ్ కలెక్టర్ సందీప్, ఇంచార్జి డీ.ఈ.ఓ సాయాగౌడ్, డీ.ఐ.ఈ.ఓ రవికుమార్, డీ.ఎం.హెచ్.ఓ డాక్టర్ రాజశ్రీ, పరీక్షా కేంద్రం నిర్వాహకుడు అయూబ్, తహసిల్దార్ హరికిషోర్ తదితరులు ఉన్నారు.