బాలల భవిష్యత్తుకు భరోసా కల్పించే బాలల ప్రత్యేక గ్రామసభలు బాలల హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
బాలల భవిష్యత్తుకు భరోసా కల్పించే బాలల ప్రత్యేక గ్రామసభలు
బాలల హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:
బాలల హక్కుల పరిరక్షణ, వారి సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న బాలల ప్రత్యేక గ్రామసభల నిర్వహణ అభినందనీయమని మిర్యాలగూడ ప్రైవేట్ పాఠశాలల టౌన్ అధ్యక్షుడు కందుల మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.
బాలలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, పౌష్టికాహారం, రక్షణతో పాటు సమాన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. గ్రామస్థాయిలో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రామసభలు దోహదపడతాయని తెలిపారు.
ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంపు, మధ్యలో చదువు మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచి పరిణామమన్నారు. అంగన్‌వాడీ సేవలు, చిన్నారుల ఆరోగ్య పరీక్షలు, పోషకాహారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా బాలల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది పడుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ గ్రామసభల్లో పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే విధానం స్వాగతించదగినదన్నారు. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
బాలల సంక్షేమమే సమాజ భవిష్యత్తుకు పునాది అని, ప్రతి బాలుడికి, బాలికకు సురక్షిత వాతావరణం, నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కందుల మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.