అమరుల త్యాగాలు పోలీసులకు స్ఫూర్తి: సైబరాబాద్ సీపీ డా. యం. రమేష్
సైబరాబాద్, మేజర్ న్యూస్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. యం. రమేశ్ బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలు పోలీసులకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందించాలని పిలుపునిచ్చారు.
విధి నిర్వహణలో పోలీసులు క్రమశిక్షణతో పనిచేయాలని, ప్రజల శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో దాదాపు 154 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు.విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులు ఫహీముద్దీన్, కె. హన్మంత్ రెడ్డి, టి. ఈశ్వర్ రావు కుటుంబ సభ్యులను సీపీ శాలువాలతో సత్కరించారు.
అమరవీరుల కుటుంబాలకు సమాజం అండగా నిలవాలని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని అధికారులు గుర్తుచేశారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ ఏడాది అమరులైన పోలీసుల పేర్లతో కూడిన రోల్ ఆఫ్ హానర్‌ను సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్ చదివారు.సంస్మరణ దినోత్సవంలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. సీపీ డా. యం. రమేశ్‌తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ సంస్థకు 87 యూనిట్లు, ఎన్టీఆర్ ట్రస్ట్‌కు 73 యూనిట్లు కలిపి మొత్తం 160 యూనిట్ల రక్తాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, కూకట్‌పల్లి డీసీపీ రితీరాజ్, క్రైమ్స్ డీసీపీ పుష్పా, శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి, వుమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ఇతర ఉన్నతాధికారులు, హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.