కడియం ఎంపీపీ అభ్యర్థిగా రాజరాజేశ్వరి జక్కంపూడి రాజా సహా పార్టీ నేతల సంప్రదింపుల అనంతరం నిర్ణయం
కడియం, మేజర్ న్యూస్,:కడియం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అభ్యర్థిగా పార్టీ జిల్లా కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి సతీమణి రాజరాజేశ్వరి పేరును పార్టీ ఖరారు చేసినట్లు సమాచారం. ఆమె పేరు అనూహ్యంగా తెరపైకి రావడంతో మండల రాజకీయాల్లో చర్చకు దారితీసింది. అభ్యర్థి ఎంపికపై జరిగిన సంప్రదింపుల్లో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కీలకంగా వ్యవహరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ సమన్వయకర్త చందన నాగేశ్వర్, మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు యాదల స్టాలిన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు తదితర నాయకుల మధ్య జరిగిన చర్చల అనంతరం రాజరాజేశ్వరి అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాడాల విష్ణు చక్రవర్తి రాజకీయ కార్యకలాపాలతో పాటు టీవీసీ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబానికి ఎంపీపీ అభ్యర్థిత్వం దక్కడంపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. రానున్న ఎన్నికల్లో రాజరాజేశ్వరి అభ్యర్థిత్వం మండల రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.