అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఫైర్!
దంతాలపల్లి, మేజర్ న్యూస్, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, తమ పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మండలంలోని వివిధ శాఖల అధికారుల పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. విధులకు హాజరుకాకుండా మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన శాఖల అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.దంతాలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం మండల ప్రత్యేక అధికారి మురళి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో శాఖల వారీగా సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లలో 72 ఇళ్లు ఇంకా నిర్మాణాలు ప్రారంభించని జాబితాలో ఉన్నాయని, వాటి విషయంలో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాలు ప్రారంభించేలా చొరవ చూపాలని, ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చూడాలన్నారు. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగంపై పడే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. రైతు సదస్సులు నిర్వహించి పంట మార్పిడిపై విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు అండగా నిలవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే అన్నారు. వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారి పి. వాహిని మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరికి బదులుగా పెసర, మినుములు తదితర ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. వరి ధాన్యం కొనుగోలు కోసం మండలంలో 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.పశువైద్యాధికారి డాక్టర్ నౌసిన్ మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి తదితర నివారణ టీకాలు క్రమం తప్పకుండా వేస్తున్నామని తెలిపారు. పశుగ్రాసం పెంపకానికి ప్రభుత్వం రూ.70 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఉద్యానవన శాఖ అధికారి స్రవంతి మాట్లాడుతూ మండలంలో 6,018 ఎకరాల వరకు ఆయిల్‌పామ్ సాగు చేపట్టారని, ఈ ఏడాది కొత్తగా 163 ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కూరగాయల సాగుకు ప్రభుత్వం రూ.లక్ష వరకు సబ్సిడీ అందిస్తోందని, ఫామ్‌పాండ్ నిర్మాణానికి రూ.90 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తోందని వివరించారు.
విద్యుత్ శాఖ ఏఈ తరుణ్ మాట్లాడుతూ మండలంలో ఇటీవల 40 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామని, వివిధ గ్రామాల్లో తక్కువ వోల్టేజీ సమస్య ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మార్చామని తెలిపారు. 1,250 గృహాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తామని పేర్కొన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కవిత మాట్లాడుతూ మండలంలో 28,781 జనాభాకు గాను 1,163 మంది అధిక రక్తపోటుతో, 624 మంది మధుమేహంతో బాధపడుతున్నారని తెలిపారు.ఎన్హెచ్ఎం ఉద్యోగులు సమ్మెలో ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 4 వరకు నిర్వహించిన కుష్ఠు వ్యాధి పరీక్షల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. హెచ్‌పీవీ టీకాల కోసం 580 మందిని గుర్తించగా ఇప్పటివరకు 341 మందికి టీకాలు అందించామని, మిగిలిన వారికి కూడా త్వరలో అందిస్తామని వివరించారు.ఉపాధి హామీ పథకం ఏపీవో మంగమ్మ మాట్లాడుతూ కూలీలకు 125 రోజుల పని కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఉండాలనే లక్ష్యంతో గ్రామాల వారీగా దరఖాస్తులు సేకరించి వందశాతం ఇంకుడు గుంతల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామపంచాయతీల ద్వారా గడ్డి పెంపకానికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.ఐకేపీ ఏపీఎం సంజీవరావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన మహిళలను స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేర్చుకుంటున్నామని, మండలంలో ఇప్పటివరకు 8,414 మంది సంఘ సభ్యులు ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 105 సంఘాలు ఏర్పాటు చేశామని, 31 వృద్ధుల సంఘాలతో పాటు వికలాంగుల కోసం కూడా సంఘాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం పంపించిన 10,800 చీరలను మహిళలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, దుబ్బతండా, వేములపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.ఎంపీవో అప్సర్ పాషా మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో ఇంటి పన్నులు వసూలు చేయాలని సూచించారు. మండలంలో రూ.21,55,410 పన్నుల డిమాండ్ ఉండగా ఇప్పటివరకు రూ.3,31,950 మాత్రమే వసూలయ్యాయని, ఇంకా రూ.18,10,540 వసూలు కావాల్సి ఉందని వివరించారు.తహసీల్దార్ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో 11,800 రేషన్ కార్డులకు సంబంధించి నెలకు సుమారు 217 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. భూముల రీ సర్వేలో భాగంగా మండలంలోని ఐదు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా, కాల్వపల్లిలో రీ సర్వే పూర్తయిందని, రామవరం గ్రామంలో కొనసాగుతోందని వివరించారు.
ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చిన్నారులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించామని, బాల్య వివాహాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అనంతరం పలువురు గ్రామ సర్పంచులు మాట్లాడుతూ వివిధ శాఖల అధికారుల పనితీరులో మార్పు రావాలని, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో తేజావత్ సక్రియ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాము గౌడ్, తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూగులోతు బట్టు నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: రాములు, దంతాలపల్లి, మహబూబాబాద్ జిల్లా