అధికారుల కొరతతో అభివృద్ధికిఆటంకం -రెగ్యులర్ అధికారులతో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
సిద్దిపేట రూరల్,: మండలంలో ఇంచార్జీ అధికారుల పాలనకు స్వస్తి పలికి, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే రెగ్యులర్ అధికారులతో భర్తీ చేయాలని మండల సర్పంచులు డిమాండ్ చేశారు.బుధవారం నారాయణరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని 11 గ్రామాల సర్పంచులు బహిష్కరించారు.అనంతరం మండల ప్రత్యేక అధికారి రాజారాంకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల కొరతతో ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాటు అభివృద్ధి పనులు కూడా కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక శాఖ, పోలీస్ స్టేషన్‌తో పాటు మరికొన్ని శాఖలు రెండు మండలాలైన చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్ పరిధిలో కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆయా శాఖలను వెంటనే విలీనం చేసి, మండలానికి పూర్తిస్థాయి అధికారులు, సిబ్బందిని నియమించాలని కోరారు.హౌసింగ్ ఏఈ ఇంచార్జీగా ఉండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. రెవెన్యూ సర్వేయర్ లేకపోవడంతో రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంచార్జీ అధికారులతో పాలన సాగిస్తే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని సర్పంచ్ లు ప్రశ్నించారు. మండలానికి పూర్తిస్థాయి అధికారులు లేకుండా అభివృద్ధి సమీక్షలు నిర్వహించడం వల్ల ప్రయోజనంఏమిటనినిలదీశారు.ఇంచార్జీలతో కాలం వెళ్లదీస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు.గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతుంటే సమీక్ష సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడం పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీ పోస్టులను రెగ్యులర్ అధికారులతో భర్తీ చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.