telangana
ఆపద వేళ కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా - నెల రోజుల పాటు కొనసాగింపు
సూర్య కరీంనగర్ ప్రతినిధి : కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు శిబిరాలు శుక్రవారం ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో నెల రోజుల పాటు శిబిరాలు నిర్వహించి అర్హుల వివరాలు నమోదు చేస్తామన్నారు. కుటుంబానికి ఒకరికి మాత్రమే రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తామని, బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీలకు పరిహారం అందుతుందని తెలిపారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వారు అర్హులని, ఇతర ప్రభుత్వ బీమా పథకాల లబ్ధిదారులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కుటుంబంలో ఎవరికి బీమా కల్పించాలి, నామినీలకు ఎంత వాటా కేటాయించాలి అనేది కుటుంబమే నిర్ణయించుకోవచ్చని పేర్కొన్నారు. నామినీల వాటాలు మొత్తం 100 శాతం ఉండాలని, మైనర్లకు నామినీగా అవకాశం కల్పిస్తే అపాయింటీని నమోదు చేయాలని సూచించారు.జిల్లాలో 3,49,125 ఆహార భద్రత కార్డు కుటుంబాలు ఉన్నాయని, శనివారం వరకు 30,931 దరఖాస్తుల వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు. శిబిరాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని, ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ తీసుకురావాలని సూచించారు. తెలంగాణ రేషన్ కార్డుదారులు ఇతర జిల్లాల్లో ఉన్నా సమీప శిబిరాల్లో నమోదు చేసుకోవచ్చని, ఈ-కేవైసీ పెండింగ్ ఉన్నవారు రేషన్ దుకాణాల్లో పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఒక రేషన్ కార్డుకు ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తామని, వివరాలను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం ట్రాన్సాక్షన్ ఐడీతో ఎస్ఎంఎస్ పంపిస్తామని పేర్కొన్నారు. భౌతిక దరఖాస్తులు, రశీదులు ఉండవని, కౌంటర్ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేసి సంతకం తీసుకుంటామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తామని, రేషన్ కార్డులు లేని కుటుంబాలకు నమోదు అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. అర్హులందరూ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.