telangana
20, 30 ఏళ్ల యువతలోనూ మధుమేహం ముప్పు: అమోర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి: 20, 30 ఏళ్ల యువతలోనూ పెరుగుతోందని అమోర్ హాస్పిటల్స్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి భోజనం, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు, చక్కెర పానీయాలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం యువతలో డయాబెటిస్ ముప్పును పెంచుతున్నా యని హెచ్చరించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అమోర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ లింగయ్య మిర్యాల మాట్లాడుతూ, కొవిడ్ తర్వాత యువతలో మధుమేహ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. చిప్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, చక్కెర పానీయాల వినియోగం, అస్తవ్యస్తమైన నిద్ర వేళలు జీవక్రియపై ప్రభావం చూపుతున్నాయన్నారు. సమయానికి భోజనం చేయడం, రాత్రివేళ బరువైన ఆహారానికి దూరంగా ఉండటం, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు.
ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎల్. సునందిని మాట్లాడుతూ, అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, కారణం లేకుండా బరువు తగ్గడం, అలసట, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు మధుమేహ సూచనలు కావచ్చన్నారు. స్థూలకాయం, కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, హెచ్‌బీఏ1సీ పరీక్షలతో మధుమేహం, ప్రీ-డయాబెటిస్‌ను గుర్తించవచ్చని తెలిపారు.ఇన్సులిన్ నిరోధకతను ముందుగానే గుర్తించి,ఆహార నియంత్రణ, వ్యాయామం, బరువు తగ్గడం ద్వారా టైప్-2 మధుమేహం ముప్పును తగ్గించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. అమోర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ బి. రెడ్డి మాట్లాడుతూ, యువతలో మధుమేహం పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు స్క్రీనింగ్, నివారణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నియంత్రణలో లేని మధుమేహం గుండె, మూత్రపిండాలు, నరాలు, కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కొన్ని సందర్భాల్లో ఐసీయూ చికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చని వైద్యులు హెచ్చరించారు