యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి :హైదరాబాద్‌లో లఘు ఉద్యోగ్ భారతీ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఇండియా కాంక్లేవ్‌కు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలదే (MSME) కీలకపాత్ర అని స్పష్టం చేశారు. దేశంలో భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుందంటే అందులో ఎంఎస్‌ఎంఈలదే ముఖ్యమైన పాత్ర అని ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఎంఎస్‌ఎంఈలకు సులువుగా రుణ సదుపాయాలు కల్పిస్తున్నామని, వాటికి తగిన మార్కెట్ అవకాశాలను కూడా పెంచుతున్నామని కిషన్‌రెడ్డి వివరించారు.
బ్యాంకులు, ఎంఎస్‌ఎంఈల మధ్య సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం, మహారాష్ట్రలో మినరల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని, వారు ఆ దిశగా అడుగులు వేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.