యాసంగిలో వరి సాగు చేయవద్దు.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మల్లాలి....జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
--యాసంగిలో వరి సాగు చేయవద్దు.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లాలి .... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
---ఖమ్మం జిల్లాలో ప్రాథమిక అంచనాల ప్రకారం 17 మండలాల్లో కరువు ప్రభావం
--యాసంగిలో సాగునీటి విడుదల ఉండదు.. త్రాగునీరు, పశువుల అవసరాలకే ప్రాధాన్యం
---పశుగ్రాసం కొరత నివారణకు ముందస్తు ప్రణాళిక.. 15 రోజుల్లో గడ్డి విత్తనాల పంపిణీ
--ఎస్ఐఆర్ 2026లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తాం
---పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు
--ఎల్నినో ప్రభావం, కరువు పరిస్థితులు, ఎస్ఐఆర్ 2026, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
(ఉమ్మడి ఖమ్మం జిల్లా సూర్య బ్యూరో చీఫ్..పసుపులేటి సత్యనారాయణ )
ఖమ్మం జిల్లాలో నెలకొన్న ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు యాసంగి సీజన్లో వరి సాగు చేయకుండా, చిరు ధాన్యాలు, పప్పుధాన్యాలు, తదితర ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని త్రాగునీరు, పశువుల అవసరాలకు వినియోగించాల్సి ఉన్నందున యాసంగిలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల నుంచి సాగునీటి విడుదల ఉండదని స్పష్టం చేశారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిపి సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి శ్రీనివాస రెడ్డి లతో కలిసి ఎల్నినో ప్రభావం, ఎస్ఐఆర్ 2026, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ముందస్తుగానే రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించామని తెలిపారు. జిల్లాలో 17 మండలాల్లో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, కరువు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 17 మండలాల్లో కరువు పరిస్థితులు ఉండవచ్చని గుర్తించామని, వీటిలో 10 మండలాల్లో తీవ్ర కరువు, ఏడు మండలాల్లో సాధారణ కరువు పరిస్థితులు ఉన్నట్లు వివరించారు.గత వర్షాకాలంలో భూగర్భ జలమట్టం సుమారు 2.5 మీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతం 3.56 మీటర్ల లోతుకు పడిపోయిందని తెలిపారు. కామేపల్లి, ఎర్రుపాలెం, సత్తుపల్లి, ఏన్కూరు మండలాల్లో భూగర్భ జలాలు 5 నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయాయని పేర్కొన్నారు.ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల కొంత మేర భూగర్భ జలాలు పెరిగినప్పటికీ, రాబోయే 15 రోజుల్లో జల మట్టాలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
గత వానాకాలంతో పోలిస్తే అధికారుల అవగాహన కార్యక్రమాల ఫలితంగా జిల్లాలో వరి సాగు విస్తీర్ణం సుమారు 90 వేల ఎకరాలు తగ్గి, ఇతర పంటలు వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. బోరుబావులపై ఆధారపడి వరి సాగు చేసిన రైతులు కూడా ప్రస్తుతం నీటి కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు.రాబోయే వర్షాకాలం వరకు తగిన వర్షాలు కురిసే అవకాశాలు పరిమితంగా ఉన్నందున రైతులు యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు.కరువు పరిస్థితుల్లో గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద అవసరమైన పనులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. గత కరోనా కాలంలో కల్పించిన ఉపాధి కంటే ఎక్కువ పనులను ప్రస్తుతం మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు, కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వీబీ-జీ రామ్జీ పథకం క్రింద భూగర్భ జలాల పెంపునకు ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, సామూహిక నీటి సంరక్షణ నిర్మాణాలు, వర్షపు నీటి సంరక్షణ గుంతలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి కాలువల్లో అడ్డంకులు, చెత్త, పిచ్చి మొక్కలను తొలగించడం వంటి పనులు చేపట్టాలని తెలిపారు.సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఉన్నందున సత్తుపల్లి, వైరా ప్రాంతాల్లో సాధ్యమైనంత మేరకు చెరువులను నింపినట్లు కలెక్టర్ తెలిపారు. తుఫాను కారణంగా పాలేరు రిజర్వాయర్ లోకి వచ్చిన అదనపు నీటిని భక్త రామదాసు ఎత్తిపోతల పథకం సహా ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా వినియోగించుకుని చెరువులను నింపినట్లు వివరించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని ప్రజల త్రాగునీటి అవసరాలకు, పశువుల నీటి అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. యాసంగి పంటలకు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల నుంచి సాగునీటి విడుదల ఉండదని స్పష్టం చేశారు. రైతులు ఈ విషయాన్ని గుర్తించి అధిక నీరు అవసరమయ్యే పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు.వైరాలో అందుబాటులో ఉన్న నీరు సుమారు 149 రోజులు, పాలేరులో నీరు సుమారు 99 రోజుల పాటు త్రాగునీరు అందించవచ్చని తెలిపారు. వచ్చే ఆగస్టు వరకు త్రాగునీటి సరఫరా కొనసాగించేందుకు పాలేరు రిజర్వాయర్ను మరో రెండు నుంచి మూడు విడతల్లో నింపాల్సి ఉంటుందని చెప్పారు.
నాగార్జునసాగర్ నుంచి త్రాగునీటి అవసరాల కోసం నీటి కేటాయింపులు కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రజలు నీటిని, విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని, నీటి వృథా, విద్యుత్ వృథాను అరికట్టాలని సూచించారు.
ఖరీఫ్ పంటలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా ప్రయత్నిస్తుందని, పోలీస్, నీటిపారుదల, వ్యవసాయ శాఖల సమన్వయంతో అందుబాటులో ఉన్న నీటిని అవసరమైన ప్రాంతాలకు చేరేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.జిల్లాలోని సుమారు ఐదు లక్షల పశువులకు అవసరమైన నీరు, పశుగ్రాసం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చే ఆగస్టు వరకు అవసరమైన పశుగ్రాసం సుమారు 7.5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ప్రస్తుతం జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉందని చెప్పారు. 12 మండలాల్లో పశుగ్రాసం కొరత ఉండగా, ఏడు మండలాల్లో తీవ్ర కొరత ఉన్నట్లు తెలిపారు.
పశుగ్రాసం కొరత మరో ఐదు నెలల తర్వాత తీవ్రంగా ఎదురయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లోటు ఉన్న మండలాల్లో పాడి రైతులను గుర్తించి పశుగ్రాస విత్తనాలు అందిస్తామని, విత్తనాలు నాటిన రెండు నెలల్లో పశుగ్రాసం అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రాబోయే 15 రోజుల్లో రైతులకు గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.నీటి కొరత పరిస్థితుల్లో అక్రమంగా నీటిని వినియోగించడాన్ని సహించబోమని కలెక్టర్ తెలిపారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో లీకేజీలు, బహిరంగ కనెక్షన్ల ద్వారా నీటి వృథాను అరికడతామని చెప్పారు. ఖాళీ ప్లాట్లకు ఇచ్చిన మిషన్ భగీరథ కనెక్షన్లను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కనెక్షన్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గత ఏడాదితో పోలిస్తే గత నెలలో విద్యుత్ డిమాండ్ సుమారు 60 శాతం, ఈ నెలలో సుమారు 80 శాతం పెరిగిందని తెలిపారు. వ్యవసాయ సంబంధిత ఫీడర్ల నుంచి విద్యుత్ డిమాండ్ అధికంగా వస్తోందని, అందుబాటులో ఉన్న వనరులతో సాధ్యమైనంత మేరకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుత పరిస్థితులపై వాస్తవ పరిస్థితులను వివరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రుణాల రీషెడ్యూల్ అంశం విధానపరమైన నిర్ణయమని, దీనిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఎస్ఐఆర్ 2026పై కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గుర్తించిన అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు సంబంధించి మొత్తం 1,74,519 నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వీటిలో 1,322 నోటీసుల పంపిణీ పెండింగ్లో ఉందని, ఆన్లైన్లో వివరాలు సమర్పించినప్పటికీ నోటీసులు అందని వారికి కూడా నోటీసులు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ఇప్పటివరకు సుమారు 1.60 లక్షల మంది ఓటర్లకు నిబంధనల ప్రకారం విచారణ ప్రక్రియ నిర్వహించామని, వారిలో 1,44,206 మందిని తుది ఓటరు జాబితాలో చేర్చేందుకు అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన విచారణ ప్రక్రియ కొనసాగుతోందని, నవంబర్ నాటికి ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ తుది ఓటరు జాబితాలో చోటు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 30,727 మంది పట్టభద్రులు ఓటరు నమోదుకు దరఖాస్తులు సమర్పించారని కలెక్టర్ తెలిపారు. గత 2024 ఎన్నికల్లో మొత్తం 83,879 మంది ఓటర్లు నమోదయ్యారని, ఈసారి కనీసం రెండు లక్షల మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
గత ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకున్నవారు కూడా ప్రస్తుత ప్రక్రియలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. పట్టభద్రులు నవంబర్ 6లోగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
దరఖాస్తుకు డిగ్రీ సర్టిఫికెట్ జతచేయాలని, సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో లేదా బూత్ స్థాయి అధికారుల వద్ద దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు.
ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు అభ్యంతరాలు స్వీకరించే సమయం ఉంటుందని తెలిపారు. నకిలీ ధ్రువపత్రాలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ ,రైతులకు వీలైనంత సహకారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీరు అవసరమైన రైతులకు చేరేలా ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
యాసంగి పంటలకు సాగునీటి విడుదల ఉండదని, అధిక నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయవద్దని రైతులకు సూచించారు. నీటి పంపిణీ సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరఫున జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.