మామిడి గుండాల భూముల రీ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్
సూర్య,ఇల్లందు,గత నాలుగు దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న ఇల్లందు మండలం మామిడి గుండాల రెవెన్యూ భూముల రీ సర్వే పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం నాడు పరిశీలించారు. రెవెన్యూ పరిధిలోని మొత్తం 4,800 ఎకరాల భూమి ఉండగా సర్వేనెంబర్ 130 లో 4,200ఎకరాలు ఉన్నట్లు అధికార లెక్కల ప్రకారం తేలింది. ఇందులో సుమారు 2,800 ఎకరాలు సీలింగ్ భూములుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా భూముల రీ సర్వే పనులు ఎలా జరుగుతున్నాయని పరిశీలించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి భూముల వివరాలను తెలుసుకున్నారు. సర్వే మ్యాప్ ను పరిశీలించి, అధికారులకు తగు సూచనలను చేశారు. సీలింగ్ భూముల విస్తీర్ణం సర్వే వివరాలను ఇల్లందు తాసిల్దార్ ఖాసీం, సర్వే అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం సర్వేను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు తాసిల్దార్ ఖాసీం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాష, జి పి ఓ లు సత్యనారాయణ,ప్రకాష్, సర్వే అధికారి రమేష్, మామిడి గుండాల సర్పంచ్ రమణ వీరభద్రం, ఉప సర్పంచ్ ధారావత్ రవి, సీలింగ్ భూముల సాధన కమిటీ నాయకులు, సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సూర్య ఆర్ సి రిపోర్టర్ రాజేష్ ఇల్లందు