మూలా నక్షత్రం వేళ అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అంతరాలయంలో శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు, మూలా నక్షత్ర పర్వదినం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు సుమారు 1,28,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ విస్తృత ఏర్పాట్లు చేయడంతో దర్శనాలు వేగంగా, ప్రశాంతంగా సాగాయని, భక్తులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు.