అక్రమ కేసులు, బెదిరింపులతో వైకాపాను అడ్డుకోలేరు: బుట్టా రేణుక
సూర్య ప్రతినిధి వెల్దుర్తి రూలర్.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, అక్రమ కేసులు, బెదిరింపులతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేరని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్లో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా ఏకగ్రీవాలు సాధించాలనే దుర్బుద్ధితోనే అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో నేరుగా గెలవలేమనే భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్య హక్కుల కాలరాణివేత
అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, భయభ్రాంతులకు గురిచేయడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుందని బుట్టా రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన ఘటనను ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా ప్రస్తావించారు. ఇలాంటి అరాచక ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షిక వాతావరణంలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ అణచివేత ధోరణులకు భయపడే ప్రసక్తే లేదని, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల పూర్తి మద్దతుతో వైకాపా ఘనవిజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
సూర్య ప్రతినిధి కే రాజశేఖర్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం