telanagana
మూలవాగు తీరాన పూల జాతర..
Telanagana
16 Oct 2026
92 views
సూర్య, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గడ్డ మీద సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. తెలంగాణ ఆత్మగౌరవానికి, పూల పండుగ వైభవానికి నిలువెత్తు అద్దంలా నిలిచే ఈ వేడుకను మన వేములవాడల శుక్రవారం నాడు ఎంతో ఘనంగా జరుపుకున్నరు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు.. మన ఆడబిడ్డల గొంతుల్లోంచి జాలువారిన జానపద గీతాలు.. యువతుల కోలాటాల సవ్వడితో రాజన్న క్షేత్రమంతా ఒక్కటేమిటి.. అచ్చం పూలవనంలా మారిపోయింది. సంప్రదాయాల పరిమళాలు వెదజల్లుతూ సాగిన ఈ వేడుకల్లో మన ఆడపడుచుల ఆనందోత్సాహాలు అన్నీ ఇన్నీ కావు.
*ఏడు రోజులకే సద్దుల ముగింపు.. ఇదో ప్రత్యేక ముచ్చట!*
మన తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు జరుపుకుంటే.. మన వేములవాడల మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ ఆడటం ఇక్కడి ప్రత్యేకత, ఒక పెద్ద ముచ్చట! ఈ ముచ్చట కోసమే అత్తారిండ్ల ఉన్న ఆడబిడ్డలంతా ‘మా పుట్టింటి పండుగ’ అంటూ పరుగు పరుగున ఊరికి చేరుకున్నారు. ఉదయం నుంచే ముత్తైదువలంతా ఇండ్ల ముందట కూర్చుని.. తంగేడు, గునుగు, కట్ల, చామంతి పూలను ఎంతో ముచ్చటగా గోపురాకృతిలో పేర్చి పూజలు చేసిన్రు.
పుట్టినింట ఆడబిడ్డల ఆటపాటలు
సాయంత్రం కాంగనే పట్టుచీరలు కట్టి, నగలు అలంకరించుకున్న ఆడపడుచులు బతుకమ్మలను చేతబట్టి మూలవాగు పరిసరాలకు చేరుకున్నారు. ఒకచోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు అందుకున్నారు.
"రామ రామ రామ ఉయ్యాలో.. రాజీవ లోచన ఉయ్యాలో.." అంటూ ఆడబిడ్డలు పాడుతుంటే వాగు పరిసరాలన్నీ మారుమోగిపోయాయి.
యువతుల కోలాటాలు, ప్రజా కళాకారుల ప్రదర్శనలు చూసేందుకు రెండు కండ్లూ చాల్లేదు.
పొద్దంతా బతుకమ్మ ఆడి.. చివరగా "పోయిరా గౌరమ్మ.. మళ్లీ ఏడూ ఐ క్క రావమ్మ" అంటూ కండ్లల్ల నీళ్లు తిరుగుతుండగా మూలవాగు బతుకమ్మ తెప్ప వద్ద నిమజ్జనం చేసి, గౌరమ్మకు వీడ్కోలు పలికిన్రు.
*వేడుకల్లో ‘పెద్దల’ సందడి.. మున్సిపాలిటీ ముస్తాబు*
ఈ ఘనమైన సంబురాల కోసం వేములవాడ మున్సిపాలిటీ వాళ్లు దాదాపు రూ. 34 లక్షలతో అదిరిపోయే ఏర్పాట్లు చేసిన్రు.
రోడ్ల పొంటా ఎల్ఈడీ లైట్లు, విద్యుత్ దీపాలతో వేములవాడను జాతరలా అలంకరించిన్రు.
మున్సిపల్ ఆఫీస్ నుంచి మూలవాగు దాకా గౌరీదేవి అమ్మవారి విగ్రహ శోభాయాత్ర కనులపండువగా సాగింది. మన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారే స్వయంగా వాహనం నడుపుతూ అమ్మవారిని మూలవాగు వద్దకు తీసుకెళ్లి ప్రతిష్ఠించడం విశేషం.
**దాండియా ఆడిన విప్, కలెక్టర్, ఎస్పీలు*
మూల వాగు వద్ద వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే పాల్గొని
బతుకమ్మ, దాండియా ఆటపాటలు ఆడారు. వేడుకలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.
*ప్రజా కళాకారిణి విమలక్క జోష్..*
విమలక్క సైతం మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడి అందరిలో జోష్ నింపింది. "మన సంస్కృతిని కాపాడుకోవాలి.. రైతన్నలు సుభిక్షంగా ఉండాలి" అని ఆకాంక్షించింది.
*ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కళా ప్రదర్శనలు*
మూలవాగు వద్ద ఏర్పాట్లలో భాగంగా పలువురు కళాకారులు చేసిన ప్రదర్శనలు అబ్బురపరిచాయి. కళాకారునిలు నెత్తిపై బోనమెత్తగా, ఒగ్గుడోలు కళాకారుల దరువు మధ్య చేసిన దాండియా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
*ముందస్తు ఏర్పాట్లతో ప్రశాంతంగా ముగిసిన వేడుకలు*
ఎస్పీ మహేష్ బిగితే పర్యవేక్షణలో డిఎస్పి శ్రీనివాస్, వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్ ఆధ్వర్యంలో
పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా వేడుకలు ఎంతో ప్రశాంతంగా ముగిశాయి.
మొత్తానికైతే.. వేములవాడ సద్దుల పండుగ మన అచ్చ తెలంగాణ యాస, భాష, సంస్కృతికి నిలువెత్తు రూపంలా నిలిచింది!
ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చెలిమెడ నరసింహారావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ,
బిజెపి వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి వికాస్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, సీనియర్
నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పొలాస నరేందర్, రామతీర్థపు రాజు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Breaking News