ద్రాక్షారామం వారసత్వంపై బీటెక్ విద్యార్థి పరిశోధన.
అనపర్తి, మేజర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయ చారిత్రక ప్రాశస్త్యం, ప్రాచీన నిర్మాణ నైపుణ్యం, శిల్పకళా వైభవం, శాసన సంపదపై అనపర్తికి చెందిన బీటెక్ విద్యార్థి ఎం. సూర్య తేజ రెడ్డి ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టును చేపడుతున్నారు. వెల్లూరులోని వీఐటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్)లో బీటెక్ అభ్యసిస్తున్న ఆయన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాచీన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ అధ్యయనం చేపడుతున్నట్లు తెలిపారు.
పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా, శక్తి పీఠాల్లో ఒకటి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ద్రాక్షారామం ఆలయం తూర్పు చాళుక్యుల కాలంనాటి వాస్తు, శిల్పకళా సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఆలయంలోని గోపురాలు, మండపాలు, స్తంభాలు, రెండు అంతస్తుల ఎత్తులో దర్శనమిచ్చే శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆధునిక యంత్రాలు అందుబాటులో లేని కాలంలోనే భారీ రాతి నిర్మాణాలను అద్భుత నైపుణ్యంతో రూపొందించడం ఆనాటి నిర్మాణకారుల ప్రతిభకు నిదర్శనమని సూర్య తేజ రెడ్డి పేర్కొన్నారు.ఆలయ గోడలు, స్తంభాలపై ఉన్న 380కి పైగా శాసనాలు ఆనాటి పాలకుల దానధర్మాలు, భూదానాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, భాషా పరిణామానికి సంబంధించిన విలువైన చారిత్రక ఆధారాలుగా నిలుస్తున్నాయని వివరించారు.ప్రాచీన కట్టడాలు, శిలాశాసనాల పరిరక్షణకు త్రీడీ స్కానింగ్, డిజిటల్ భద్రత, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించుకునే అవకాశాలను తన పరిశోధనలోపరిశీలిస్తున్నట్లు తెలిపారు. భక్తి, చరిత్ర, కళ, విజ్ఞానం మేళవించిన ద్రాక్షారామం వంటి వారసత్వ క్షేత్రాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, వాటి విశిష్టతను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని సూర్య తేజ రెడ్డి అభిప్రాయపడ్డారు.