పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ అమరేంద్ర కుమార్ శుక్రవారం నాడు సాధారణ పర్యటనలో భాగంగా నెల్లూరులోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా, రైల్వే ఫీడర్స్ రోడ్డులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉన్న వెటర్నరీ పాలీక్లినిక్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో, వాటి స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి సంబంధించి సంచాలకులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.అనంతరం, ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండ్రీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ ఎస్ . కృష్ణారావు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ రాజేష్ ఎన్ బేటి సంచాలకులను కలిసి పశుసంవర్ధక శాఖలోని పశువైద్య అధికారుల క్యాడర్ సమస్యలు, ముఖ్యంగా ప్రొవిజనల్ ఆర్డర్-2025 అమలులో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వి ఏ ఎస్ ) జరిగే అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా వారు ప్రధానంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వి ఏ ఎస్ ) క్యాడర్ను మల్టీ-జోనల్ క్యాడర్గా పరిగణించాలని, అసిస్టెంట్ డైరెక్టర్ (ఏ డి ) క్యాడర్ను రాష్ట్ర స్థాయి క్యాడర్గా కొనసాగించాలని కోరారు. ఈ మార్పుల ద్వారా పశువైద్య అధికారులకు న్యాయబద్ధమైన అవకాశాలు కల్పించడంతోపాటు పోస్టులు, క్యాడర్ కేటాయింపులు మరియు పదోన్నతులకు సంబంధించిన నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు.అలాగే నిరుద్యోగ వెటర్నరీ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి న్యాయబద్ధమైన డిమాండ్లు, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల కల్పనకు సంబంధించిన అంశాలను కూడా సంచాలకుల దృష్టికి తీసుకువచ్చి, వాటిపై సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అలాగే పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న పశువైద్య అధికారుల సమస్యల పరిష్కారంతోపాటు, నిరుద్యోగ వెటర్నరీ గ్రాడ్యుయేట్లకు న్యాయం జరిగేలా సంబంధిత అంశాలను ప్రభుత్వ స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.