అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం
సూర్య అమలాపురం మేజర్ న్యూస్ : అమలాపురంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుల సమన్వయ సమావేశం శుక్రవారం స్థానికంగా నిర్వహించారు. ఈ సమన్వయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య స్థానిక సంస్థల వార్డుల కేటాయింపుపై కీలక చర్చలు జరిగి, పరస్పర ఒప్పందం కుదిరింది. జనసేన నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జి బండారు శ్రీను, అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల సతీష్, జనసేన అమలాపురం ఎన్నికల ఇంచార్జిలు నల్లా శ్రీధర్, చిక్కం భీముడులతో ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ సానా సతీష్ బాబులు ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ చర్చల అనంతరం స్థానిక వార్డులలో కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీలకు కలిపి మొత్తం 14 వార్డులను కేటాయించేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. వీటిలో 12 వార్డులను జనసేన పార్టీకి, 2 వార్డులను బీజేపీకి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కూటమిలోని అన్ని పక్షాలు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి విజయాన్ని సాధించాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.