ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలి -- నారాయణపేట బిఆర్ఎస్ నాయకులు
*నారాయణపేట, సూర్యన్యూస్ :* ప్రజలు అవకాశం ఇచ్చి అధికారం కట్టబెడితే అభివృద్ధి పనులు చేస్తూ ప్రజాసేవలో నిమగ్నం కాకుండా కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తూ కాలాన్ని వృధా చేస్తున్నారని మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాసరెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వేపూరి రాములు, పట్టణ అధ్యక్షులు విజయ్ సాగర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం పనులు చేస్తుంటే ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటాయని, నికార్సైన రాజకీయం చేయాలని హితవు పలికారు. వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడడం సరికాదని, కాంగ్రెస్ నాయకుల చిట్టా బయటికి తీస్తే తెల్ల ముఖం వేసుకుంటారన్నారు. జిఓ 69 విషయంలో ఇప్పటివరకు డిపిఆర్ బయట పెట్టలేదని, మక్తల్ నుంచి నారాయణపేట మీదుగా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు తగు, సాగు నీరు అందిస్తామని చెప్పిన నాయకులు రీ డిజైన్ పేరుతో అప్పిరెడ్డిపల్లి, తిరుమలాపూర్, ధన్వాడ, భైరంకొండ, జలాల్ పూర్, ఎక్లాస్ పూర్ తదితర గ్రామాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రాజక్ట్ పూర్తి వివరాలు మీడియా ద్వారా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. భూత్పూర్ నుంచి కానుకుర్తి చెరువు వరకు పైప్ లైన్ ద్వారా నీటిని తరలిస్తే మక్తల్, నారాయణపేట నియోజకవర్గ రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని, ఇక్కడ భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఓపెన్ కెనాల్ ఏర్పాటు చేయడంలో అంతర్యం ఏమిటని, పూర్తిగా నీరు సీఎం రేవంత్ రెడ్డి నియోజక వర్గానికి వెళతాయని అన్నారు. భూములకు డబ్బులు దండుకోవడానికే ఇక్కడి నాయకులకు పనికొస్తుందని దుయ్యబట్టారు.
*ఆస్పత్రి పోస్టులు అమ్ముకుంటున్నారు..!*
జిల్లా ఆస్పత్రి సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి మంజూరైన కాంట్రాక్టు ఉద్యోగాలను డబ్బులకు అమ్ముకుంటున్నారని బిఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రభుత్వం శాశ్వతం కాదని అభివృద్ధి పై దృష్టి సారిస్తే భవిష్యత్తు ఉంటుందని హితువు పలికారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతిపక్షంగా తమ మద్దతు పూర్తిగా ఉంటుందని, ప్రజలకు నష్టం కలిగితే తప్పకుండా ప్రశ్నిస్తామన్నారు. వ్యక్తిగతమైన ఆరోపణలు మానుకోవాలని, తాము ప్రశ్నించడం మొదలుపెడితే ఇబ్బంది పాలవుతారని హెచ్చరించారు. నిజమైన ఎమ్మెల్యే ఎవరో అర్థం కావడంలేదని, ఏ హోదాలో ఎవరు ఏ కార్యక్రమాలు పాల్గొంటున్నారు అధికారులకే అర్థం కావడం లేదని దివ్యపట్టారు. పార్టీ పోస్ట్ కూడా లేని వ్యక్తులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజలను, ప్రతిపక్షాలను, మీడియాను బెదిరించి అధికారం చలాయించాలనుకోవడం సరికాదన్నారు. ప్రజల ముందు తమ నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. సమావేశంలో సుదర్శన్ రెడ్డి, కన్న జగదీష్ పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట