గౌతమ్పూర్లో చెట్ల తొలగింపు బిల్లులపై వివాదం!
సూర్యచుంచుపల్లి గౌతమ్పూర్ గ్రామపంచాయతీ రోజురోజుకూ వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే గ్రామంలో కోతులు, కుక్కల బెడదను పరిష్కరించాలని కోరుతూ గ్రామసభను గ్రామస్థులు బహిష్కరించిన ఘటన మరువకముందే తాజాగా గౌతమ్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కాలనీల్లో చెట్ల కొమ్మల తొలగింపు పనులకు సంబంధించిన బిల్లులపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
గ్రామంలోని వివిధ కాలనీల్లో చెట్ల కొమ్మల తొలగింపు పనుల పేరుతో సమర్పించిన బిల్లుల్లో అవకతవకలు జరిగాయనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. చెట్ల కొమ్మలు తొలగించిన కూలీల వేతనాల కంటే ఎక్కువ బిల్లులు పెట్టారని ఆరోపణలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. చేపట్టిన పనులకు, బిల్లుల్లో చూపించిన మొత్తం మధ్య వ్యత్యాసం ఉందని, ఈ వ్యవహారంలో ప్రజాధనం దుర్వినియోగమైందేమోనని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. గత రెండు నెలల కింద గౌతంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మిలీనియం కోటర్స్ పరిధిలో చెట్ల కొమ్మలను తొలగించడానికి ముగ్గురు వ్యక్తులు రెండు రోజులు పనిచేస్తే నాలుగు రోజులు పని చేసినట్లుగా రికార్డులో నమోదు చేయడం పలు అనుమానాలకి తావిస్తుంది. వారికి రోజువారి వేతనం 1200 చొప్పున రికార్డులు నమోదు చేశారు. ఈ మధ్య రోజుల్లోనే మళ్లీ గౌతమ్ పూర్ కాలనీలలో చెట్ల కొమ్మలను తొలగించడానికి 61 వేల రూపాయల బిల్లును పెట్టారని గౌతమ్ పూర్ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. రెండు రోజులు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కొమ్మలు నరికినందుకే 61 వేల బిల్లులు ఎలా ఖర్చు అవుతాయని ప్రజలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
*బిల్లులపై అధికారుల పర్యవేక్షణ ఏదీ?*
గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. అలాంటప్పుడు చెట్ల కొమ్మల తొలగింపు పనులకు సంబంధించిన బిల్లులు ఏ ప్రాతిపదికన రూపొందించారు? పనుల పరిమాణాన్ని, ఖర్చులను అధికారులు పరిశీలించారా? క్షేత్రస్థాయిలో పనులను తనిఖీ చేసిన తర్వాతే బిల్లులకు ఆమోదం తెలిపారా? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో అధికారుల పర్యవేక్షణలో లోపాలున్నాయా? బిల్లుల పరిశీలనలో నిర్లక్ష్యం జరిగిందా? అనే అంశాలపై కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. అయితే, అధికారుల ప్రమేయం లేదా అక్రమ చెల్లింపులు జరిగినట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
*బహిరంగ విచారణ జరపాలని డిమాండ్*
చెట్ల కొమ్మల తొలగింపు పనులకు సంబంధించిన బిల్లులు, పనుల వివరాలు, ఖర్చుల లెక్కలను బహిరంగంగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని గౌతమ్పూర్ గ్రామస్థులు సొప్పరి క్రాంతి బిజెపి నాయకుడు తదితరులు కోరుతున్నారు. గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, ప్రజాధనం దుర్వినియోగమైనట్లు విచారణలో తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో జరిగిన పనులను బిల్లులతో సరిపోల్చి, సంబంధిత అధికారుల పర్యవేక్షణను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడిస్తారా? ఆరోపణలపై సమగ్ర విచారణ చేపడతారా? అన్నది వేచి చూడాలి.
*గౌతమ్ పూర్ పంచాయత్ సెక్రెటరీ షర్మిల వివరణ కోరగా*
గౌతమ్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగింపు పనుల్లో బిల్లుల విషయంలో అవకాతవకల్లు జరిగాయన్న విషయంపై గౌతంపూర్ గ్రామపంచాయతీ సెక్రటరీ షర్మిల వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ తీర్మానంలో రాసింది 61000 రెండు రోజులు పనిచేశారు. గత రెండు నెలల ముందు కూడా మిలీనియం కోటర్స్ లో చెట్లు తొలగింపు ముగ్గురు వ్యక్తులు రెండు రోజులు పనిచేసినందుకు 30000 రూపాయలు చెల్లించామని ఇవన్నీ తీర్మానం ప్రకారమే చేసామని తెలిపారు.
సూర్య రిపోర్టర్ దస్రు చుంచుపల్లి