సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలి - ఎమ్మెల్యే కూనంనేని
సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలి
- ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం ఆర్ సీ, సూర్య(మేజర్ న్యూస్)- సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆకాంక్షించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణ పరిధిలోని గాజులరాజం బస్తీ, నెహ్రూ బస్తీ తదితర ప్రాంతాల్లో ఉత్సవ కమిటీలు ప్రతిష్టించిన దుర్గాదేవి అమ్మవారి మండపాలను శుక్రవారం ఆయన సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటామని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పండుగలు, ఉత్సవాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజహితమైన సేవా భావాన్ని, పరస్పర సోదరభావాన్ని పెంపొందిస్తాయని, పేదలకు ఆకలి తీర్చే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత పవిత్రమైన, అభినందనీయమైన కార్యమని కొనియాడారు. బస్తీలలో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కార్పొరేటర్లు, గడ్డం శాంతిప్రియ, దాసరి శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, నాయకులు గడ్డం రాజయ్య, ప్రభాకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.