ఓటర్ల తుది జాబితా పారదర్శకంగా ఉండాలి.... * ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
భోగాపురం, సూర్య : ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చోటు కల్పిస్తూ, అనర్హుల తొలగింపులో నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఓటర్ల జాబితా పరిశీలకుడు, ఐఏఎస్ అధికారి రోణంకి గోపాలకృష్ణ అధికారులకు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా తుది జాబితాను రూపొందించాలని సూచించారు.
* తగ్గిన ఓటర్ల సంఖ్య
శుక్రవారం భోగాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, మండలంలో ఎస్ఐఆర్ కింద ఇప్పటివరకు నిర్వహించిన సర్వే, ఓటర్ల వివరాల సవరణపై తహసీల్దార్ పి. రమేష్తో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారిక గణాంకాల ప్రకారం, 2026 మే 25 నాటికి మండలంలో 46,957 మంది ఓటర్లు ఉండగా, అక్టోబర్ 16 నాటికి ఆ సంఖ్య 45,519కు చేరిందని అధికారులు వివరించారు.
* గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలి
ఎస్ఐఆర్ ప్రక్రియకు అక్టోబర్ 30 వరకు గడువు ఉన్నందున, మిగిలిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు. సవరణల అనంతరం తుది ఓటర్ల జాబితాను సంబంధిత పంచాయతీ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ, నిబంధనల ప్రకారమే తుది జాబితాను ప్రకటిస్తామని తహసీల్దార్ రమేష్ తెలిపారు.
రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.