*ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు.... *నామినేషన్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
విజయనగరం, సూర్య : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించి, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను, నామినేషన్ల స్వీకరణ కౌంటర్లను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణలో పారదర్శకత పాటించాలని, అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందిస్తూ, ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్య ధోరణికి తావివ్వకుండా, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ, అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సందర్శనలో మునిసిపల్ కమిషనర్ బాలస్వామి పాల్గొన్నారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.