విద్యుత్ షాక్‌తో గ్రామపంచాయతీ వర్కర్ మృతి * కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పనుల వద్ద విషాద ఘటన
విద్యుత్ షాక్‌కు గురై గ్రామపంచాయతీ వర్కర్ మృతి చెందిన విషాద ఘటన ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. వెల్టూర్ గ్రామపంచాయతీలో వర్కర్‌గా పనిచేస్తున్న ఎడ్ల నిరంజన్ (45) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్‌ఫార్మర్ పనుల్లో పాల్గొన్నారు.ట్రాన్స్‌ఫార్మర్‌ను దిమ్మెపై అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో నిరంజన్ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సిబ్బంది డిండి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.మృతుడికి భార్య జంగమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిరంజన్ మృతితో వెల్టూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం, గ్రామపంచాయతీ ఆదుకుని తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గణేష్ గౌడ్, ఉప్పునుంతల, సూర్య న్యూస్