భీమవరంలో మతిస్థిమితం లేని యువకుడు వీరంగం
తల్లిని గాయపరచిన కొడుకు ఇతరులపై విసిరిన రాళ్ళు, కత్తులు వైద్యశాలకు తరలించిన పోలీసులు
మర్రిపాడు మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు ఆత్మకూరు డి.ఎస్.పి వెంకటేశ్వర్లు సూచనల మేరకు ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని మర్రిపాడు మండలం భీమవరం గ్రామంలో మానసిక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకుడికి అవసరమైన వైద్య సహాయం అందించేందుకు పోలీసులు గురువారం చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని భీమవరం గ్రామానికి చెందిన గాలిబోయిన మురళి మానసిక స్థితి సరిగా లేకుండా తన తల్లి ఆదిలక్ష్మమ్మను తలపై కొట్టడంతో పాటు, గ్రామంలోని ఇతర వ్యక్తులపై రాళ్లు విసురుతూ, కత్తులు మరియు కర్రలు చేతబట్టి గ్రామంలో తిరుగుతూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు గ్రామస్థులు మర్రిపాడు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆత్మకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆదేశాల మేరకు మర్రిపాడు ఎస్సై బలరామిరెడ్డి వెంటనే విచారణ చేపట్టారు. విచారణ అనంతరం న్యాయస్థానం అనుమతి పొంది, ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ సూచనల మేరకు యువకుడికి మానసిక వైద్య చికిత్స అవసరమని గుర్తించారు. వైద్యుల సూచనల మేరకు సదరు యువకుడిని అతని తల్లిదండ్రుల సమక్షంలో కడపలోని రిమ్స్ కు చికిత్స నిమిత్తం తరలించి, అతని మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు అవసరమైన వైద్య చికిత్స అందించేందుకు ఆసుపత్రి వైద్యుల ఆధీనంలో అప్పగించడం జరిగింది. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల పట్ల పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ, వారికి అవసరమైన వైద్య సహాయం అందించడంతో పాటు, వారి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థుల భద్రతకు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల వల్ల వారికి లేదా ఇతరులకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉన్నట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. సంబంధిత వైద్య మరియు న్యాయ అధికారులతో సమన్వయం చేసుకుని, చట్టపరమైన విధానాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.