చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం
చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం
చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని జి.సి.డి.ఓ అలివేలు మంగతాయారు అన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మైలారంలో గురువారం నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పిల్లలకు సమతుల్యమైన,పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.ఈ సందర్భంగా ఇక్రిశాట్ సీనియర్ శాస్త్రవేత్తల బృందం వై. వినోద్, ఈ. కిరణ్, కె. క్రాంతి మాట్లాడుతూ.. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) భద్రాచలం ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సహకారంతో గిరిజన గ్రామాల్లోని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో చదువుతున్న 7 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు చిరుధాన్యాలను నిత్య ఆహారంలో భాగంగా చేర్చే ఆవశ్యకతను వివరించారు.
ణచిరుధాన్యాల వినియోగం వల్ల పిల్లల్లో శారీరక ఎదుగుదల, ఆరోగ్యం, పోషక విలువలు మెరుగుపడతాయని తెలిపారు.తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారంలో రాగులు,జొన్నలు,సజ్జలు వంటి చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మైలారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోగ రాంబాబు, సహోపాధ్యాయులు జి. కుమార్ రాజా, అనంతో గుబాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చీమల భద్రమ్మ, ఎస్‌సీఆర్‌పీ నెహ్రూ, ఉపాధ్యాయులు కృష్ణ, ఆయా జోగ సావిత్రి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి ప్రవీణ్ ఆళ్లపల్లి