తెలంగాణకు మరో ఆణిముత్యం.. ఏషియన్ చాంపియన్‌షిప్‌కు ఆకుల అక్షిత ఎంపిక
చింతపల్లి, నల్గొండ జిల్లా: జాతీయస్థాయి త్రోబాల్ పోటీల్లో సత్తాచాటి భారత జట్టుకు ఎంపికై, ఏషియన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్న చింతపల్లి మండలం చాకలి శేరిపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి ఆకుల అక్షితకు ఘన సత్కారం లభించింది. బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్‌రెడ్డి అక్షితను అభినందించి సన్మానించారు.
ఈ సందర్భంగా కంకణాల వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. అక్షిత అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి, తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది యువతలో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆకుల అక్షితకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఏషియన్ చాంపియన్‌షిప్‌లో అక్షిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సర్పంచ్ మాచర్ల శ్రీశైలం, ఉపసర్పంచ్ పగడాల వెంకటయ్య, ఆకుల జగతయ్య, వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.