కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష
- మరో 15–20 ఏళ్లు కూటమి పాలన ఉంటే సంపూర్ణ అభివృద్ధి
-వైసిపి పార్టీకి శాశ్వత సమాధి కడితేనే ఇది సాధ్యం
-చీమకుర్తిలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కారుమంచి మేజర్ కెనాల్ జల హారతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
సూపర్ ఎల్‌నినో వంటి విపత్కర పరిస్థితుల్లోనూ చీమకుర్తి వంటి మారుమూల ప్రాంతానికి తాగునీటిని అందించడం గొప్ప విషయమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి నిర్వహణలో చూపుతున్న సమర్థత, ముందుచూపును జాతీయ మీడియా గుర్తించి ఆయనను ‘వాటర్‌మ్యాన్’గా అభివర్ణించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు.
ముఖ్యమంత్రి ముందుచూపుతో రాష్ట్రంలోని రిజర్వాయర్లలో కనీస నీటి నిల్వలను కాపాడుతూ తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చీమకుర్తి ప్రాంత ఇరిగేషన్ పనులకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు అందించిన విజ్ఞాపనలను స్వీకరించిన మంత్రి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం మరో 15–20 ఏళ్లు కొనసాగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. అధికారాన్ని తరచూ మార్చుకుంటూ పోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
2019లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టులు 2021 నాటికే పూర్తయ్యేవని మంత్రి నిమ్మల అన్నారు. అయితే ‘ఒక్క ఛాన్స్’ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. ఇరిగేషన్ శాఖకు సుమారు రూ.18 వేల కోట్ల అప్పు వారసత్వంగా ఇచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పరిస్థితులతో పాటు ఇరిగేషన్ రంగాన్ని కూడా గాడిలో పెట్టారని మంత్రి తెలిపారు.
రెండేళ్లలో సాగునీటి రంగంలో కీలక పురోగతి
రాయలసీమకు జీవనాడిగా ఉన్న హంద్రీ–నీవా ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు చేసి, 728 కిలోమీటర్ల మేర కృష్ణా జలాలను తరలించామని మంత్రి తెలిపారు. రూ.2,200 కోట్లు ఖర్చు చేసి మూడు దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టు కలను సాకారం చేశామని అన్నారు. వెలిగొండ ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్‌కు చేరి ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. రూ.1,800 కోట్లు ఖర్చు చేసి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా సెప్టెంబర్ 2న ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని అన్నారు. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తామో చెప్పలేమని గత పాలకులు చేతులెత్తేశారని మంత్రి విమర్శించారు. అదే పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముందే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని తెలిపారు.
ఓ అండ్ ఎం పనులకు భారీగా నిధులు
సాగునీటి వ్యవస్థల నిర్వహణ, మరమ్మతులకు అత్యవసరంగా చేపట్టాల్సిన ఓ అండ్ ఎం పనులపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఓ అండ్ ఎం పనులకు రూ.1,320 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టి ఉంటే కారుమంచి మేజర్ కెనాల్‌కు ఇంతటి నష్టం జరిగేది కాదన్నారు.
గత పాలనలో జరిగిన మైనింగ్ పేలుళ్ల కారణంగా కారుమంచి మేజర్ కెనాల్ గట్టు తీవ్రంగా దెబ్బతిందని మంత్రి తెలిపారు. దీంతో సుమారు 16 వేల ఎకరాలకు సాగునీరు అందకుండా పోయిందని, అలాగే 8 మంచినీటి చెరువులకు నీరు చేరక తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించారు.
అయినప్పటికీ గత పాలకులు ప్రజల కష్టాలను పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (DMF) నుంచి రూ.2.65 కోట్లు వెచ్చించి కారుమంచి మేజర్ కెనాల్‌ను పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని తెలిపారు.
శేషయ్యకు మంత్రి అభినందనలు
కారుమంచి మేజర్ కెనాల్ నిర్మాణం, పటిష్టతకు సంబంధించిన సాంకేతిక అవరోధాలను తొలగించడంలో చీమకుర్తికి చెందిన, ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న శేషయ్య అందించిన సహకారాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు.
కారుమంచి మేజర్ కెనాల్ కోసం రూ.25 లక్షల విరాళం అందించిన శేషయ్యకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ‘పి-4’ కార్యక్రమానికి స్పందించి శేషయ్య ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామి కావడం అభినందనీయమన్నారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే లు దామచర్ల జనార్దన్, బి. ఎన్. విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు, దర్శి టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ప్రవాసాంధ్రుడు నల్లారి శేషయ్య, తదితరులు పాల్గొన్నారు.