స్వార్థం కోసం కాదు.. ఊరి అభివృద్ధి కోసమే త్యాగం చేశా
బీఆర్ఎస్ నేతల విమర్శలపై జీవన్గి సర్పంచ్ రామని బసప్ప ఆవేదన
నాడు కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి.. నేడు విమర్శలు చేయడం సరికాదు
బషీరాబాద్, మేజర్ న్యూస్,( అక్టోబర్ 5):
తాను వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారలేదని, జీవన్గి గ్రామ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరానని జీవన్గి గ్రామ సర్పంచ్ రామని బసప్ప స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధికి నిధులు సమకూర్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అయితే తన పార్టీ మార్పును కొందరు రాజకీయంగా విమర్శిస్తూ, తనపై కుట్రలు చేయించడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిధులు లేక అభివృద్ధి పనులకు ఆటంకం
సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తగినన్ని నిధులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని బసప్ప తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులతో అవసరమైన పనులు చేయించడం మినహా పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయానని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నాననే బాధ తనను వెంటాడిందన్నారు.
ఎమ్మెల్యే దృష్టికి గ్రామ సమస్యలు
జీవన్గి గ్రామంలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తాండూరు ఎమ్మెల్యే బూయని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు బసప్ప తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు సహకరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారని చెప్పారు. గ్రామ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని తీసుకున్నానని స్పష్టం చేశారు.
నాడు ఆహ్వానించి.. నేడు విమర్శలా?
తాను కాంగ్రెస్‌లో చేరే సమయంలో తనను ఆహ్వానించి, కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పిన కొందరు నాయకులే ప్రస్తుతం తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని బసప్ప ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులను వెనుకుండి ప్రోత్సహిస్తూ తనపై విమర్శలు చేయించడం సరికాదన్నారు. సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవన్గి అభివృద్ధే ఏకైక లక్ష్యం
తాను తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని స్వార్థపూరితంగా చూడవద్దని బసప్ప కోరారు. గ్రామ ప్రజల భవిష్యత్తు, జీవన్గి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. గ్రామానికి అవసరమైన నిధులు సాధించి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని రామని బసప్ప స్పష్టం చేశారు.
రిపోర్టర్ ఖాసీం పాషా.