డ్రగ్స్‌కు నో చెప్పండి.. రోడ్డు భద్రత పాటించండి
వేమగిరిలో 150 మంది కార్మికులకు పోలీసుల అవగాహన
కడియం, మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా దక్షిణ మండల ఈగల్ బృందం, కడియం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వేమగిరిలోని శ్రీ సర్వారాయ షుగర్స్ లిమిటెడ్ (కోకాకోలా కంపెనీ)లో డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు
.ఈ సందర్భంగా సుమారు 150 మంది కార్మికులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ముఖ్యంగా గంజాయి తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల వ్యక్తిగత జీవితం దెబ్బతినడంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు వివరించారు.అదేవిధంగా రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలను వివరించారు.
సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోరాదని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో భయాందోళనలకు గురికాకుండా పోలీసులను సంప్రదించి సహాయం పొందాలని తెలిపారు. నేరాల నివారణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దక్షిణ మండల ఈగల్ బృందం హెచ్‌సీ-2881 జి. వెంకటరావు, పీసీ-1002 వి. రామ్‌కుమార్, పీసీ-2786 సురేష్, కడియం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ చుక్కల వెంకట రమణ పాల్గొన్నారు.