నర్సరీ మట్టి లారీలకు టోల్ మినహాయింపు ఇవ్వాలి.. ఎంపీ పురందేశ్వరికి నర్సరీ రైతుల వినతి
కడియం, మేజర్ న్యూస్ :కడియం మండలం కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం అధ్యక్షుడు బోర్సు సుబ్బారాయుడు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరిని కలిసి నర్సరీ రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద మట్టి లారీలకు విధిస్తున్న రూ.1,280 టోల్, కాటా బిల్లును నర్సరీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మినహాయించాలని కోరారు. నర్సరీలకు మట్టి అత్యవసరమైన ముడిసరుకని, రవాణాపై అదనపు భారం పడటంతో చిన్న, సన్నకారు రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.రైతులకు మేలు జరిగేలా టోల్ మినహాయింపు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ పురందేశ్వరి హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పుల్లా శ్రీనివాస్, కార్యదర్శి పాఠంశెట్టి శ్రీనువాసు, సంయుక్త కార్యదర్శి అన్నందేవుల వెంకటేశ్వరరావు, కోశాధికారి డేగల రాము, సంయుక్త కోశాధికారి గట్టా కృష్ణ భగవాన్, కన్వీనర్ సానా రాజు, ప్రజా సంబంధాల అధికారి కామిశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.