శిథిలావస్థలో జూలూరుపాడు గ్రంథాలయం
శిథిలావస్థలో జూలూరుపాడు గ్రంథాలయం
విద్యార్థులు,నిరుద్యోగులకు అందని పుస్తక విజ్ఞానంనూతన భవనం నిర్మించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీ డిమాండ్ కేంద్రంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం జూలూరుపాడులో ఆయన విలేకరులతొ మాట్లాడుతూ..పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు,నిరుద్యోగులకు గ్రంథాలయాలు ఎంతో కీలకమన్నారు.స్థానిక గ్రంథాలయ భవనం దెబ్బతిని, కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.గ్రంథాలయం అనేది కేవలం పుస్తకాలు చదివే ప్రదేశం మాత్రమే కాదని,విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంతోపాటు పోటీ పరీక్షలకు అవసరమైన సమాచారాన్ని అందించే విజ్ఞాన కేంద్రంగా పనిచేస్తుందని వంశీ పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో గ్రామీణ,ఏజెన్సీ ప్రాంతాల నిరుద్యోగులకు అందుబాటులో ఉండే గ్రంథాలయం అవసరం మరింత పెరిగిందన్నారు.శిథిలావస్థకు చేరిన భవనంలో విద్యార్థులు చదువుకోవడం ఇబ్బందికరంగా మారిందని,ప్రమాదకర పరిస్థితుల్లో గ్రంథాలయాన్ని కొనసాగించడం సరికాదన్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని వంశీ డిమాండ్ చేశారు.గ్రంథాలయంలో అవసరమైన ఫర్నిచర్,పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు,దినపత్రికలు,ఇతర అధ్యయన సామగ్రిని సమకూర్చాలని కోరారు.స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని వంశీ కోరారు.సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థులను సమీకరించి ఉద్యమం చేపడతామన్నారు.
సూర్య ప్రతినిధి సిద్ధిక్ జూలూరుపాడు