భూ భారతిలొ భూ రీ-సర్వే ను పకడ్బందీగా చేపట్టాలి
భూ భారతిలొ భూ రీ-సర్వే ను పకడ్బందీగా చేపట్టాలి
నల్లబండ బోడులో భూ రీ-సర్వే తీరును పరిశీలించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్రైతులకు భూ హక్కులపై స్పష్టతే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశంకలెక్టర్ కు స్థానిక సమస్యలను తెలిపిన గ్రామ రైతులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ రికార్డుల నిర్వహణ కోసం తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ లొ భూ రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి,భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.జూలూరుపాడు మండలం నల్లబండబోడు గ్రామంలొ జరుగుతున్న భూ సర్వే ను కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నల్లబండబోడు గ్రామాన్ని భూభారతి పోర్టల్ లో సర్వే నిర్వహణ కొరకు పైలాన్ ప్రాజెక్టుగా సర్వేకు ఎంపిక చేశారు.రీ-సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి,రికార్డులతో సరిపోల్చి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.సర్వే పురోగతి,గ్రామ సరిహద్దుల నిర్ధారణ,ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను రెవెన్యూ,సర్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు.గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 1,426 ఎకరాల భూమి ఉండగా,సుమారు 12.50 కిలోమీటర్ల మేర రీ-సర్వే చేపడుతున్నట్లు రెవిన్యూ,సర్వే అధికారులు వివరించారు.
రైతులకు స్పష్టమైన భూ హక్కులు
భూ రీ-సర్వే ద్వారా భూముల సరిహద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలు మరింత స్పష్టంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.భవిష్యత్‌లో భూ సరిహద్దులు,రికార్డులకు సంబంధించిన వివాదాలు తగ్గడంతో పాటు రైతులకు తమ భూమిపై హక్కులకు సంబంధించి స్పష్టత ఏర్పడుతుందన్నారు.భూముల వివరాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేసి, రికార్డులను పక్కాగా రూపొందించడమే రీ-సర్వే ప్రధాన ఉద్దేశమనికలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు.భూ రీ-సర్వే ద్వారా భూముల సరిహద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను కచ్చితంగా నమోదు చేసి, భూ భారతి పోర్టల్‌లో సమగ్ర భూ రికార్డులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రైతులకు భూ హక్కులపై స్పష్టత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.సర్వే సందర్భంగా రైతుల సమక్షంలో భూ సరిహద్దులను పరిశీలించాలని,వారికి ఉన్న సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు.రీ-సర్వే కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ,సర్వే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
స్థానిక రైతులతో మాట్లాడిన కలెక్టర్
అనంతరం గ్రామంలోని రైతులతో కలెక్టర్ మాట్లాడారు.వారి భూముల వివరాలు,సాగు చేస్తున్న పంటల గురించి తెలుసుకున్నారు.రైతు భూక్యా పంతులు తనకు రెండు ఎకరాల భూమి ఉందని, ఒక ఎకరంలో పత్తి,మరో ఎకరంలో మిర్చి సాగు చేస్తున్నట్లు తెలిపారు.తన కుమారులు పట్టించుకోవడం లేదని,వృద్ధాప్య పింఛన్ కోసం ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.స్పందించిన కలెక్టర్ దరఖాస్తును వెంటనే పరిశీలించి,అర్హత మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ అంకిత్ సూచించారు.ఈ కార్యక్రమంలొ కలెక్టర్ వెంట మండల తహసీల్దార్ తూమాటి శ్రీనివాస్,ఎంపీడీఓ తాళ్లూరి రవి,రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)మహంకాళి ఝాన్సీ రాణి,సర్వేయర్ ప్రవీణ్,నల్లబండ బోడు సర్పంచ్ గడిగ సింధు,జీపీవో లు అనసూర్య,రమేష్,పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి సిద్ధిక్ జూలూరుపాడు