భవన నిర్మాణ కార్మికులు వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి ---సహాయ కార్మికాధికారి గోపీ కుమార్.
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; భవననిర్మాణ కార్మికులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను వినియోగించు కోవాలని సహాయ కార్మికాధికారి ఎ.గోపీకుమార్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎస్వీఆర్ సర్కిల్ సమీపంలోని విజయభారతి ఐటీఐలో జాతీయ నిర్మాణ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులలో గురువారం ఆయన మాట్లాడారు. నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు. కార్మికుల నైపుణ్యాభివృద్ధికి , ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు కీలక ప్రాధాన్యం ఇస్తున్నదని గోపీకుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో నిర్మాణ రంగంలో వచ్చే మార్పులను కార్మికులు నిరంతరం అవగాహన చేసుకోవాలని గోపీకుమార్ కోరారు. కార్మికులు కూడ నిత్య విద్యార్ధులేనని ఆయన అన్నారు. శిక్షకుడు నందం సూర్యచక్ర మాట్లాడుతూ ప్రస్తుతం తాపీ పనివారికి 15 రోజుల శిక్షణ ఇస్తున్నామని, నిర్మాణంలో పాటించాల్సిన సాంకేతిక అంశాలను, మెళకువలను, ఆధునిక పరికరాల వినియోగంపై అవగాహనను కల్పిస్తున్నామని తెలిపారు. శిక్షణా కార్యక్రమాల సహాయ సంచాలకులు ఎం.వసంతరావు ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. సోమసుందర్ మాట్లాడుతూ రానున్న పదేళ్లలో నిర్మాణ రంగం మరింతగా వృద్ధి సాధిస్తుందని, వృత్తి నిపుణులకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతుందని, అందువల్ల కార్మికులు నైపుణ్యాన్ని పెంచుకోవాలని కోరారు. అనుభవం ద్వారా లభించే నైపుణ్యానికి తోడు ఆధునిక శిక్షణ ద్వారా తెలుసుకునే సాంకేతిక అంశాలు కార్మికులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. భారత ప్రభుత్వ జాతీయ నిర్మాణ అకాడమీ జారీ చేస్తున్న సర్టిఫికెట్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. ఏరియా భవననిర్మాణ కార్మికసంఘం అధ్యక్షులు పడాల శ్రీనివాస్, భవననిర్మాణ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ ఎఐటియుసి ఏరియా అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు, భవన నిర్మాణ కార్మికసంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోడె సాయిబాలాజీ, మాట్లాడారు. శిక్షణ పొందుతున్న కార్మికులు కర్రి చందు కుమార్, కంకిపాటి రాజు, పెరికే భరత్ కుమార్ మాట్లాడుతూ శిక్షణ వల్ల తమకు వృత్తిలో అవగాహన పెరిగిందని తెలిపారు.
రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా