విజయ్ దేవరకొండ రణబాలి మూవీ వెనుక అసలు కథ ఇదే.. డైరెక్టర్ రాహుల్ ఆసక్తికర విషయాలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు టాలెంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ మూవీ రణబాలిపై సినిమా సర్కిల్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రిటీష్ కాలం నాటి చారిత్రక పరిస్థితుల ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకుంది. ఈ వేదికగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని మరియు చరిత్రను ప్రేక్షకులతో పంచుకున్నారు.
శ్యామ్ సింగరాయ్ చిత్రం తర్వాత తదుపరి సినిమా ఎవరితో చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో తన ముందుకు ఒక బుర్రకథ వచ్చిందని, అది విని తాను విపరీతంగా షాకయ్యానని రాహుల్ తెలిపారు. ఒక వీరుడి కథను విన్నానని, ఆ వీరుడితో నేరుగా దేవుళ్లు మాట్లాడారనే అంశం తనను ఎంతగానో ఆకర్షించిందని పేర్కొన్నారు. అప్పుడే ఇలాంటి చారిత్రక నేపథ్యంతో సినిమా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాయలసీమ చరిత్రను లోతుగా చదివానని, అయితే కరువు కేవలం రాయలసీమకే పరిమితం కాకుండా నాటి రోజుల్లో అన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసిందని అన్నారు. ముఖ్యంగా గ్రేట్ సౌత్ ఇండియన్ మద్రాస్ ప్రాంతంలో కేవలం రెండేళ్ల వ్యవధిలో కోటి మంది ప్రాణాలు కోల్పోయారనే చారిత్రక సత్యాన్ని వార్తల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుని తీవ్రంగా చలించిపోయినట్లు రాహుల్ వెల్లడించారు.
ఈ భారీ కథకు ఒక బలమైన బిగ్ కటౌట్ హీరో అవసరమని భావించానని, ఈ పాత్రకు విజయ్ దేవరకొండ మాత్రమే నూటికి నూ శాతం సరిపోతాడని తనకు ముందు నుంచే స్పష్టత ఉందని డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమా ప్రయాణం వెనుక దాదాపు నాలుగు సంవత్సరాల కఠిన శ్రమ ఉందని, కోటి మంది ప్రాణాలను బలిగొన్న ఆనాటి దారుణ పరిస్థితుల గురించి తెలుసుకున్నప్పుడు తనలో కలిగిన కోపం, ఆవేశమే ఈ రణబాలి కథకు పునాది అని స్పష్టం చేశారు. ఆ కాలం నాటి దుష్ట శక్తులను, పిశాచాలను తరిమికొట్టేందుకు కసాపురం ఆంజనేయస్వామి ఎదురొస్తే ఎలా ఉంటుందనే అద్భుతమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వివరించారు. కుమారస్వామి యుద్ధానికి వెళ్లేముందు స్వీకరించే ప్రత్యేక అవతారమే రణబాలి అని, అందుకే ఆ మురుగన్ పేరుతో ఈ టైటిల్ పెట్టామని అన్నారు. ఒక సరికొత్త యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని, ప్రేక్షకులకు ఇది ఒక అద్భుతమైన అనుభూతిని పంచుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి