సర్పంచులకు శిక్షణ.. గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
సర్పంచులకు శిక్షణ.. గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
గుమ్మడిదల :గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా గుమ్మడిదల మండలంలోని సర్పంచులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం మండల స్పెషల్ ఆఫీసర్ అఖిలేష్ రెడ్డి పాల్గొనగా, ఎంపీడీవో ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సభలో సర్పంచులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విలేజ్ రీసెర్చ్ మ్యాప్ వర్క్స్, గ్రామంలోని వనరులు, నీటి వనరుల గుర్తింపు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సింగూరు–మంజీరా నీటి సరఫరా డిసెంబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉన్నందున, గ్రామాల్లో నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని భూగర్భ జలాల పెంపునకు వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.