గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలి
మోమిన్‌పేట సర్పంచ్ కలకోటి సంధ్యా సుభాష్‌గౌడ్
మోమిన్‌పేట, మేజర్ న్యూస్( అక్టోబర్ 2):
గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మోమిన్‌పేట గ్రామ సర్పంచ్ కలకోటి సంధ్యా సుభాష్‌గౌడ్ అన్నారు. ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మోమిన్‌పేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ సంధ్యా సుభాష్‌గౌడ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ చూపిన అహింస, సత్యాగ్రహ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో గ్రామంలోని పలు సమస్యలపై చర్చించారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన పురాతన ఇళ్లను కూల్చివేయాలని గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సర్పంచ్.. సంబంధిత ఇంటి యజమానులకు ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసి, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను త్వరలో తొలగించే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపు: ఏపీవో శంకరయ్య
ఏపీవో శంకరయ్య మాట్లాడుతూ.... ఇళ్ల నుంచి వెలువడే మురుగు నీటిని భూమిలోకి ఇంకేలా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు. తద్వారా భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. ఇంకుడు గుంతలను నిర్మించుకున్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని వివరించారు.వీబీజీ రామ్‌జీ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అందుబాటులోకి వచ్చే నిధులను గ్రామాభివృద్ధికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లేశంగౌడ్, ఉపసర్పంచ్ వెంకట్‌రెడ్డి, వార్డు సభ్యులు మహమ్మద్ అప్సర్, శోభన్, రమేష్, అంజి, సుధాకర్, అరిగె సూరి, ఆర్‌ఎన్, పంచాయతీ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ వడ్ల మాణిక్యం చారి.