సమాజ హితం కోసం వైబ్రేంట్ అడ్వకేట్ అసోసియేషన్
న్యాయవాదుల సంక్షేమంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
వికారాబాద్‌లో సంస్థను ప్రారంభించిన సీనియర్ న్యాయవాది నూలి బస్వరాజ్ పటేల్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 2): గాంధీ జయంతిని పురస్కరించుకుని వికారాబాద్ పట్టణంలో వైబ్రేంట్ అడ్వకేట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. సమాజ హితం, న్యాయవాదుల సంక్షేమం, ప్రజలకు న్యాయపరమైన అవగాహన కల్పించడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్రధాన లక్ష్యాలుగా సంస్థను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు, సీనియర్ న్యాయవాది నూలి బస్వరాజ్ పటేల్ మాట్లాడుతూ....న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించేలా న్యాయవాదులు సామాజిక బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యల పరిష్కారంతో పాటు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయ, సామాజిక సమస్యలపై స్పందించేందుకు తమ సంస్థ ఒక బలమైన వేదికగా పనిచేస్తుందని తెలిపారు.
*న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యం
న్యాయవాదుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలు, అవసరమైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై సంస్థ నిరంతరం పనిచేస్తుందని బస్వరాజ్ పటేల్ తెలిపారు. అదే విధంగా పేదలు, బలహీన వర్గాలు, న్యాయ సహాయం అవసరమైన వారికి న్యాయపరమైన అవగాహన, మార్గదర్శకత్వం అందించేందుకు కార్యక్రమాలు చేపడతామన్నారు.
*ప్రజల్లో న్యాయ అవగాహన పెంపే లక్ష్యం
ప్రజలకు రాజ్యాంగ హక్కులు, చట్టపరమైన హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు న్యాయ అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. సమాజంలో అన్యాయం జరిగిన సందర్భాల్లో బాధితులకు అండగా నిలిచి, చట్టపరమైన పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లేలా సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు.గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా భావాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో న్యాయం, సమానత్వం, సామాజిక బాధ్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ
కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఆనంద్, శుభప్రద్ పటేల్, లక్ష్మణ్ ముదిరాజ్, తులసీరామ్, రాఘవన్ నాయక్, పరుశురాం, పరమేష్, మోహన్ రాథోడ్, మహేశ్వర్ రెడ్డి, రాజు, జనార్దన్, సాధిద్దీన్, అయూబ్, సుమలత, ప్రజ్ఞా రెడ్డి, నిర్మల నాయక్, బాలకృష్ణ, అజీజ్, ఈశ్వర్ రెడ్డి, సాయి బ్రహ్మచారి, రవి ప్రకాష్, బాలరాజ్ పటేల్, నరహరి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.