గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్
జాతిపిత మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో టీటీడీ ఉద్యోగులు మరింత నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీ జేఈఓ (వైద్యం, విద్య) ప్రభల గోపీనాథ్ కోరారు. స్వచ్ఛత, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విశ్వాసంతో శ్రీవారి దర్శనానికి వచ్చే పవిత్రమైన టీటీడీలో పనిచేయడం మన అదృష్టమని, సేవా భాగ్యమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి మానవతా దృక్పథంతో భక్తులకు సేవలందించాలని సూచించారు. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సత్యం, అహింస మార్గాల ద్వారా ప్రజలను ఏకం చేసిన గాంధీజీ, సామాజిక అసమానతల నిర్మూలనకు, అన్ని వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని తెలిపారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని కోరారు. సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో ఆనందరాజు, తిరుపతి ఎస్టేట్ ఆఫీసర్ సువర్ణమ్మ, తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, సీఏఓ వేంకటరమణ, శ్వేత ఇన్‌చార్జి సంచాలకులు డా. వేమా వెంకట రత్నం, ఇతర అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి