12 నుంచిశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు -భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలి : టిటిడి జేఈఓ డా.ఎ.శరత్
ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకియం లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తిచేయాలని టిటిడి జేఈఓ డా.ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జేఈఓ (వైద్యం, విద్య) ప్రభల గోపినాథ్‌తో కలిసి శుక్రవారం ఉదయం పలు శాఖల అధికారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలోని ప్రధాన ప్రాంతాల్లో ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతాలు, హోల్డింగ్ పాయింట్ల వద్ద భక్తులకు అవసరమైన త్రాగునీరు, మరుగుదొడ్లు, సమాచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు అవసరమైన సమాచారం స్పష్టంగా అందేలా సూచికలు, ప్రకటనలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసేందుకు ప్రత్యేక కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, రోజువారీగా ఏర్పాట్లను పర్యవేక్షించాలని జేఈవో సూచించారు. తిరుపతికి కలిసే నాలుగు ప్రధాన కూడళ్ల వద్ద మరింత ఆకర్షిణీయంగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలని తెలిపారు. ప్రధాన రహదారులు, భక్తుల రాకపోకలు ఉండే ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.ఈ వర్చువల్ సమీక్షలో సీఈ శ్రీ మనోహరం, ఎస్‌ఈ వేంకటేశ్వర్లు, వీజీఓ గిరిధర, డిప్యూటీ ఈవో సెల్వం, టిటిడి ట్రాన్స్‌పోర్ట్ జీఎం రాము, సీఎంవో కుసుమ కుమారి, డీఈలు రవిశంకర్ రెడ్డి, సరస్వతి, ఈఈ మల్లికార్జున ప్రసాద్, అదనపు హెల్త్ ఆఫీసర్ డా.సునీల్ కుమార్ పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి