నర్సరీ రైతులకు తక్కువ ధరకే ఎర్రమట్టి :సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్
కడియం, నర్సరీ రైతులకు అవసరమైన ఎర్రమట్టిని తక్కువ ధరకే అందించేందుకు సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం మరో ముందడుగు వేసింది. కడియం మండలం కడియపులంకలోని అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సరీ రైతులకు ఎర్రమట్టి సరఫరా కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.
ఇటీవల ఎర్రమట్టి లారీ ధరలు క్రమంగా పెరిగి ప్రస్తుతం సుమారు రూ.11 వేలకు చేరుకున్న నేపథ్యంలో, రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు అసోసియేషన్ ద్వారా 6 యూనిట్ల ఎర్రమట్టిని రూ.9,300కే సరఫరా చేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బొర్సు సుబ్బారాయుడు తెలిపారు. తక్కువ ధరకు నాణ్యమైన ఎర్రమట్టిని అందించడం ద్వారా నర్సరీ రైతులకు కొంత మేర ఆర్థిక వెసులుబాటు కల్పించడమే లక్ష్యమన్నారు.
నర్సరీల నిర్వహణలో ఎర్రమట్టి కీలకమైన అవసరమని, ధరల పెరుగుదలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య చేపట్టినట్లు పాలకవర్గ సభ్యులు తెలిపారు. అసోసియేషన్ అందిస్తున్న ఈ అవకాశాన్ని నర్సరీ రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బొర్సు సుబ్బారాయుడు, ఉపాధ్యక్షుడు పుల్లా శ్రీను, జాయింట్ సెక్రటరీలు బోడపాటి చంద్రశేఖర శ్రీనివాస్ శేఖర్, అన్నందేవుల వెంకటేశ్వరరావు, ఉండమట్ల అర్జున్, ట్రెజరర్ డేగల రాము, జాయింట్ ట్రెజరర్లు గట్టా కృష్ణ భగవాన్, దూలం సత్యనారాయణమూర్తి, పీఆర్వో కామిశెట్టి వెంకటేష్, కన్వీనర్ సానా రాజు తదితరులు పాల్గొన్నారు.