మర్పల్లిలో రూ.71 లక్షలతో ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కృషితో పరిపాలనా అనుమతులు
జీ+1లో 10 షాపులు.. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం
మర్పల్లి, మేజర్ న్యూస్(అక్టోబర్ 02):వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో నూతన ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. రూ.71 లక్షల అంచనా వ్యయంతో జీ+1 విధానంలో 10 షాపులతో కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 5, మొదటి అంతస్తులో 5 షాపులు ఏర్పాటు చేయనున్నారు.
*పాత కాంప్లెక్స్ శిథిలావస్థలో..
మర్పల్లిలో 1986లో నిర్మించిన పాత ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఐదు షాపులు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మూడు షాపులు కూలిపోవడంతో లబ్ధిదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మర్పల్లి మండల పర్యటన సందర్భంగా పాత కాంప్లెక్స్ స్థానంలో నూతన కాంప్లెక్స్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
*రూ.71 లక్షలకు అనుమతి
స్పీకర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా షెడ్యూల్డ్ కాస్ట్ సర్వీస్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ సొసైటీ లిమిటెడ్ (ఎస్సీ కార్పొరేషన్) ఆధ్వర్యంలో రూ.71 లక్షలతో నూతన కాంప్లెక్స్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
*మౌలిక వసతులతో నిర్మాణం
నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు తాండూర్ పంచాయతీరాజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు బాధ్యతలు అప్పగించారు. కాంప్లెక్స్‌లో టాయిలెట్లు, మెట్ల సౌకర్యంతో పాటు రోడ్డు స్థాయి కంటే సుమారు మూడు అడుగుల ఎత్తులో బేస్‌మెంట్ ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.నిర్మాణం పూర్తయితే వికారాబాద్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10 షాపులతో నిర్మించనున్న తొలి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌గా ఇది నిలవనుంది. దీంతో పాత కాంప్లెక్స్ లబ్ధిదారులకు మెరుగైన వాణిజ్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
రిపోర్టర్ పి.రాములు.