రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి
ఒక్క గొర్రె పిల్ల మాత్రమే సజీవం.. రూ.లక్షల్లో నష్టం
రైల్వే ట్రాక్‌కు ఫెన్సింగ్, అండర్‌పాస్ నిర్మించాలని స్థానికుల డిమాండ్
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్, (సెప్టెంబర్ 29):
రైల్వే ట్రాక్ దాటుతున్న గొర్రెల మందను దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న విషాద ఘటనలో సుమారు 100 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఔషాపూర్ మారుతినగర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.తెల్లవారుజామున రైల్వే ట్రాక్ దాటుతున్న గొర్రెల మందపై వేగంగా వచ్చిన దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకెళ్లడంతో భారీ సంఖ్యలో గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. ప్రమాదంలో ఒక్క గొర్రె పిల్ల మాత్రమే సజీవంగా బయటపడింది. కళ్లముందే తమ జీవాలు మృత్యువాతపడటంతో వాటి యజమానులు కన్నీరుమున్నీరయ్యారు.
లక్షల్లో ఆస్తినష్టం
గొర్రెల మృతితో జీవాల పెంపకందారులకు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. జీవాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ఈ ఘటన తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, రైల్వే అధికారులు స్పందించి మృతిచెందిన గొర్రెలకు తగిన పరిహారం అందించాలని కోరారు.
ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
ఔషాపూర్ ప్రాంతంలో తరచూ పశువులు, గొర్రెలు రైల్వే ట్రాక్ దాటుతున్నాయని స్థానికులు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రైల్వే ట్రాక్ వెంట ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పాదచారులు, వాహనాలు, జీవాల రాకపోకలకు అనువుగా అండర్‌పాస్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. రైల్వే, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.రిపోర్టర్ గుర్రం రమేష్.