కొత్తగూడెం
డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేయాలి
- బీజేపీ డిమాండ్
కొత్తగూడెం ఆర్ సీ, సూర్య(మేజర్ న్యూస్) - డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం జరగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ డేలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ, పాత కొత్తగూడెంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లాటరీ పద్ధతిలో కేటాయించిందని, ఆనాడు లాటరీలో వచ్చిన లబ్ధిదారులకు ముందుగా ఇళ్లు కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. గతంలో మంజూరైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా మళ్లీ కొత్తగా లాటరీ తీయడం, పాత లబ్ధిదారుల పేర్లు తొలగించి కొత్త వారి పేర్లు చేర్చడం వల్ల వారికి తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. పాత లబ్ధిదారులతో పాటు అర్హులైన కొత్త వారికి కూడా ఇళ్లు ఇవ్వాలని, మైనారిటీ కోటా పేరుతో ప్రత్యేక రిజర్వేషన్ కాకుండా బీసీ కోటా కింద పరిగణించాలని కోరారు.ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఒక్కో ఇంటికి సుమారు రూ.1.50 లక్షలు, హడ్కో ద్వారా నిధులు మంజూరు అవుతున్నాయని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు జూజూరు మోహన కృష్ణ, మువ్వ అపర్ణ, భూక్యా ఆశ, భోగా లక్ష్మి, సుజాతనగర్ మండల అధ్యక్షురాలు పద్మ, భూక్యా మోహన్, మహేష్, కోటి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.