సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలి
35 కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
సూర్య రాజన్న సిరిసిల్ల:
గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు, రాజీవ్ విద్యా మిషన్, క్రిస్మస్, రంజాన్, కేసీఆర్ కిట్ వంటి వివిధ సంక్షేమ పథకాల ఆర్డర్లను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడంతో సిరిసిల్లలోని నేత కార్మికులు తీవ్ర ఉపాధి సంక్షోభంలో కూరుకుపోయారని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి లేక,ఇంటి అద్దెలు కట్టలేక, పిల్లలను పోషించుకోలేక,అప్పుల బాధతో మనోవేదనకు గురై ఇప్పటివరకు 35 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.మృతి చెందిన కుటుంబాలు నిరుపేద కుటుంబాలని, వారి పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇంటి అద్దెలతో దీనావస్థలో ఉన్నారని పేర్కొన్నారు.నేడు సిరిసిల్లకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఆ 35 కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.