గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు
ఏఎన్ఎం లను వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని డిమాండ్!
మోస్తున్నారని మరింత పనిభారం మోపుతున్నారు!
ఏఎన్ఎం లపై ఇతర శాఖల పనిభారం తగ్గించాలన్న ఆస్కార్ రావు
ఎస్.రాయవరం, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్:
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలపై పెరుగుతున్న పనిభారంపై ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గొంతి ఆస్కార్ రావు తీవ్ర ఆందోళన, నిరసన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియోలో పలు అంశాలను ప్రస్తావించారు. వైద్య ఆరోగ్య శాఖను నోడల్ డిపార్ట్‌మెంట్‌గా పేర్కొంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.113, 124లు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపించారు. దీనివల్ల ఏఎన్ఎంలు వైద్య సేవలతో పాటు ఇతర శాఖల అదనపు పనులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
*ఏఎన్ఎం లను వైద్య ఆరోగ్యశాఖలో విలీనం చేయాలి!*
ఏఎన్ఎం లను పూర్తిస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేసి, పని ఒత్తిడిని తగ్గించాలంటూ ఆస్కార్ రావు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెట్టారు.
పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు ఏఎన్ఎంలపై పెత్తనం చెలాయిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని బెదిరించడం మానుకోవాలి!
ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా ఓటీపీ, ఆన్‌లైన్ ఎంట్రీల పేరుతో పెరుగుతున్న డిజిటల్ పనిభారాన్ని తగ్గించాలి!
వైద్య రంగంలో ఏఎన్ఎంలు అందిస్తున్న విశేష సేవలను ఆయన కొనియాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణ కోసం అహోరాత్రులు పని చేస్తున్నా వీరంతా 'మహా తల్లులు' అన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఈ ఉద్యోగులపై శాఖల వారీగా పోటీపడి మరీ పనిభారాన్ని పెనుభారంగా చేసేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఇంతకష్టపడే అత్యవసర వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులంతా ఐకమత్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.