సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి
సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి
-మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సూర్య, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తోందని, సిరిసిల్లలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభను నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
మంగళవారం సిరిసిల్లలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను ఆయన మరో మంత్రి అడ్డూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి తోపాటు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు, కార్మిక, విద్యార్థి వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపకుండానే పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు.
-విపక్షాలకు సభతో జ్ఞానోదయం తప్పదు
రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన ప్రతిపక్షాలు సరైన దిశానిర్దేశం లేకుండా విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో సమస్యలు తలెత్తినా, వానలు పడకపోయినా ఆనందించే స్థితికి విపక్షాలు దిగజారాయని ఆరోపించారు. సిరిసిల్ల వేదికగా సీఎం ఇచ్చే సందేశం విపక్షాలకు కనువిప్పు కలిగిస్తుందని, అందుకే వారిలో గుబులు మొదలైందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం పంపిణీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, నిరుద్యోగులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని వివరించారు. ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా ఈ సభను భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.