ప్రజావాణికి గైర్హాజరు.. ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు
అనుమతి లేకుండా గైర్హాజరుపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 5): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అనుమతి లేకుండా గైర్హాజరైన ముగ్గురు అధికారులకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.అయితే సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం. వెంకయ్య, సహాయ కార్మిక కమిషనర్ (ఎఫ్‌ఏసీ) బి. వల్యా, టీజీఎస్‌ఆర్టీసీ వికారాబాద్ డిపో మేనేజర్ నమ్రత ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు కలెక్టర్ కార్యాలయం గుర్తించింది.అధికారుల అనధికార గైర్హాజరు కారణంగా పరిపాలనకు అసౌకర్యం కలగడంతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై ప్రభావం పడిందని నోటీసులో పేర్కొన్నారు. ప్రజావాణికి గైర్హాజరు కావడంతో పాటు టూర్ డైరీ/గైర్హాజరు వివరాలు సమర్పించకపోవడంపై వివరణ కోరారు.
మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలి
నోటీసు అందిన తేదీ నుంచి మూడు రోజుల్లోగా తమ గైర్హాజరుకు గల కారణాలను వివరిస్తూ లిఖితపూర్వక సమాధానం సమర్పించాలని కలెక్టర్ దీపక్ తివారి నోటీసులో ఆదేశించారు. నిర్ణీత గడువులోగా వివరణ అందకపోతే తమకు చెప్పేందుకు ఎలాంటి వివరణ లేదని భావించి, నిబంధనల ప్రకారం తదుపరి క్రమశిక్షణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ పేరిట సోమవారం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.