పట్టభద్రుల ఓటరు నమోదుకు పిలుపు – డిప్యూటీ కమిషనర్ ఎం.ఎన్.ఆర్. జ్యోతి
సికింద్రాబాద్ మేజర్ న్యూస్: తెలంగాణ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల దృష్ట్యా అర్హత కలిగిన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు పిలుపునిచ్చారు. 70-సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల నమోదు అధికారి మరియు డిప్యూటీ కమిషనర్ ఎం.ఎన్.ఆర్. జ్యోతి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన రాబోయే ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే, అర్హత కలిగిన పట్టభద్రులు నిర్ణీత గడువులోగా ఫారం–18 ద్వారా దరఖాస్తు సమర్పించాల్సిందిగా ఆమె సూచించారు.
పట్టభద్రులు సులభంగా నమోదు చేసుకునేందుకు ఆన్లైన్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫారం–18ను నింపి సమర్పించవచ్చని పేర్కొన్నారు. అలాగే సంబంధిత క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా దరఖాస్తు చేయవచ్చని చెప్పారు.
అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, గడువు ముగిసేలోపు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఎన్నికల నమోదు అధికారి విజ్ఞప్తి చేశారు.