telanagana
నేర రహిత మందమర్రి లక్ష్యంగా పోలీసుల సమష్టి కృషి - మాదకద్రవ్యాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి - పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో సీపీ అంబర్ కిశోర్ ఝా సూచనలు
సూర్య, మందమర్రి, మందమర్రి ప్రాంతంలో నేరాల నియంత్రణతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. గురువారం మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన పరిశీలించి, నేర నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్షించిన ఆయన ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న మందమర్రిలో దొంగతనాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ సూచించారు. గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట నిబంధనల ప్రకారం గ్యాంగ్ ఫైళ్లు ప్రారంభించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కార్యకలాపాలు, పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్‌పై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ కేంద్రం, రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్‌లో వివరాల నమోదు, ఆన్‌లైన్‌లో రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యారక్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, 5ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడిన సీపీ వారి వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెట్రోలింగ్ వాహనాల నిర్వహణ, వివిధ విభాగాల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఈ తనిఖీలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, మందమర్రి ఎస్‌ఐ గోపతి నరేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.