కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రాష్ట్ర వాటాగా రూ.100 కోట్లు విడుదల: ఎంపీ హరీష్ పై బీజేపీ నేత మోకా వెంకట సుబ్బారావు ప్రశంసలు
సూర్య అమలాపురం బ్యూరో: కోనసీమ ప్రజల చిరకాల స్వప్నమైన కోటిపల్లి–నర్సాపురం నూతన రైల్వే లైన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 100 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంపై భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల కోసం ప్రత్యేక చొరవ చూపి పట్టుబట్టిన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్ (జి.ఎం. హరీష్ బాలయోగి)ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా మోకా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ ప్రాధాన్యతనిస్తున్నాయని స్పష్టం చేశారు.దివంగత బాలయోగి ఆశయ సాధన దిశగా:మాజీ లోక్‌సభ స్పీకర్ దివంగత జి.ఎం.సి. బాలయోగి ఈ ప్రాంత ప్రజారవాణా కోసం కన్న కలలను సాకారం చేసే దిశగా ఆయన తనయుడు, ఎంపీ హరీష్ మధుర్ ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు.
డబుల్ ఇంజిన్ సమన్వయం:కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం పూర్తి సమన్వయంతో ముందుకు సాగుతూ కోనసీమ ప్రాంత రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాయని వివరించారు.
ఊపందుకోనున్న భూసేకరణ – వంతెనల నిర్మాణం :పనుల్లో వేగం:రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 100 కోట్ల నిధులతో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ శరవేగంగా పూర్తవుతుందని, దీని ద్వారా గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదులపై నిర్మిస్తున్న కీలకమైన మేజర్ రైల్వే వంతెనలు, ట్రాక్ నిర్మాణ పనులు త్వరితగతిన కొలిక్కి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.కోనసీమ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ నిధుల మంజూరుకు కృషి చేసిన ఎంపీ హరీష్ మధుర్‌కు, నిధులు కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర రైల్వే శాఖకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.